కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ముందు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఆయన ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ అయితే కరోనా ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను దింపడం తో పాటుగా ఆ ప్రాంతాలను ఆయన నేరుగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు.
ఇక ప్రజలకు కూడా ఆయన ఎక్కడా బయపడాల్సిన అవసరం లేదనే ధైర్యం కల్పిస్తూ ముందుకి వెళ్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనితో అక్కడ వైద్య సిబ్బంది ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీనితో అరవింద్ కేజ్రివాల్ వాళ్ళ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. వారితో పాటుగా కరోనా విధులు నిర్వహిస్తున్న ప్రతీ ఉద్యోగికి కూడా ఆయన ఆర్ధిక భద్రత కల్పించడానికి సిద్దమయ్యారు.
కరోనా సోకిన వారికి వైద్య సహాయం అందిస్తూ మరణించిన వారికి కోటి రూపాయలను సాయంగా కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. వైద్యులతో పాటు నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ జాబితా కిందికి వస్తారని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అన్న భేదమేమీ లేదని, కరోనా సోకిన వారికి సేవ చేస్తూ పై రంగాల వారు ఎవరు మరణించినా వారికి ఈ సాయం లభిస్తుందని సిఎం కీలక ప్రకటన చేసారు.