తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు నేడు. ప్రతియేడు ఘనంగా తెరాస కార్యకర్తలు, అభిమానుల మధ్య వేడుకలు జరుపుకునే మంత్రి.. ఈ ఏడాది వర్షాలు బీభత్సం సృష్టించి ప్రజలు ఇబ్బంది పడుతున్నందున వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.
అయితే.. తన పుట్టినరోజు కానుకగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్.. ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరంలాగా.. ఈ ఏడాది కూడా కొనసాగించాలని కోరారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. గులాబీ శ్రేణులు, అభిమానులు అవసరం ఉన్న వారికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హనుమకొండలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను తెరాస నేతలు ఘనంగా జరిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం మొక్కలు నాటారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద ఆటోడ్రైవర్లకు ఆటోలను పంపిణీ చేశారు.
మంత్రి కేటీఆర్ కాలికి స్వల్ప గాయాలవ్వడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. ఆయన పుట్టినరోజు కానుకగా.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద డ్రైవర్లకు ఆటోలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం ఛైర్మన్ అజీజ్ ఖాన్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.