ఎమ్మెల్సీగా మధుసూధనాచారి ప్రమాణ స్వీకారం..

ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, మధుసూదనాచారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ, గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు మధుసూదనాచారి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.

ఇదిలా ఉంటే గతంలో పాడి కౌషిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా ఈ ఫైల్ ను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ పక్కకు పెట్టారు. దీంతో కౌషిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. సీనియర్ నేత, మాజీ సభాపతి మధుసూదనాచారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు.

టీఆర్ఎస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్న మధుసూదనాచారి 2014లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై… తెలంగాణ తొలి స్పీకర్ గా రికార్డ్ కెక్కారు. అయితే 2019 ముందస్తు ఎన్నికలకు వెళ్లింది టీఆర్ఎస్ పార్టీ. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు సిరికొండ మధుసూదనాచారి. ఆ తరువాత నుంచి చాలా కాలంగా రాజ్యసభ, ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.