కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో గత 40 రోజుల నుంచి మూతపడ్డ మొబైల్ షాపులు ఇక తెరుచుకోనున్నాయి. దేశంలోని గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మొబైల్ షాపులను ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర హోం శాఖ చెప్పడంతో మొబైల్ స్టోర్ల యజమానులకు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఫోన్ల అమ్మకాలు లేక తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారులు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మొబైల్ షాపులను ఓపెన్ చేసుకోవచ్చని చెప్పినప్పటికీ అవి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 మధ్యే పనిచేయాల్సి ఉంటుంది. ఇక సింగిల్‌గా ఉండే షాపులు, కాలనీలు, బస్తీల్లో ఉండే షాపులను మాత్రమే ఓపెన్ చేయాలి. మార్కెట్ కాంప్లెక్స్‌లు, మాల్స్‌లో ఉండే మొబైల్ షాపులపు ఓపెన్ చేసేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ కేంద్రం తీసుకున్న నిర్ణయంలో కొంత మందికి ఊరట కలుగుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) అభిప్రాయపడింది.
కాగా సర్వేలు చెబుతున్న నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న అనేక మొబైల్ షాపులలో ఇప్పటికే కొన్ని లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడు కాక స్టోర్లలో స్టాక్ ఉన్నాయని తెలిసింది. ఈ క్రమంలోనే ఆ ఫోన్లను ప్రస్తుతం మొబైల్ షాపుల వ్యాపారులు విక్రయించనున్నారు.