మోదీ 2.0: ఆరు నెలల్లో అద్భుతాలు చేసిందా..!

-

నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో….ఊహించని మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం..నేటితో ఆరు నెలలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఆరు నెలల పాలన కాలంలో ఎన్డీయే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే…మొదట మోదీ 2.0లో అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు మరింత గుర్తింపు వచ్చేలా చేసిందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా భారత్ స్థాయిని పెంచేందుకు పలు దేశాల్లో తిరిగిన మోదీ… వెళ్లిన ప్రతిచోటా, భారత ఖ్యాతిని మరింత పెంచారు.

ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి సంచలనం సృష్టించింది. ఈ విషయంలో పాకిస్థాన్ కుట్రలు సాగనివ్వకుండా, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కి మద్దతు కూడగట్టటంలో కేంద్రం విజయం సాధించింది.  జమ్మూకాశ్మీర్ అంశంతోపాటూ… ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాక్ బిల్లును తెచ్చారు. అలాగే 2025 నాటికి రూ.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా వివాదాల్లో నలుగుతున్న అయోధ్య రామమందిరం భూ వివాదానికి మోదీ పాలనలోనే పరిష్కారం దొరకడం కలిసొచ్చే అంశం.

వివాదాస్పద భూమి అయోధ్య ట్రస్ట్ కు దక్కడం పట్ల హిందువులు బీజేపీ పట్ల మరింత సానుకూలంగా ఉన్నారు.  ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీం చెప్పుకోతగ్గది. దీని ద్వారా వంట గ్యాస్‌ లేనివారికి కేంద్రం గ్యాస్‌ బండ, ఎల్‌పిజీ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తోంది. అలాగే పి‌ఎం కిసాన్ పథకం కూడా బాగానే పని చేస్తుంది. అయితే ఆర్థిక మాంద్యం మోదీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది. బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలేవీ మాంద్యం కోరల నుంచీ దేశాన్ని కాపాడలేకపోతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న ఉద్దీపన నిర్ణయాలు కూడా కలిసిరావట్లేదనే వాదన వినిపిస్తోంది. మోదీ తొలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విపక్షాలు, కొంతమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిపుణల అనుకున్న విధంగానే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఏకంగా ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 4.5 శాతానికి పరిమితమైంది. అటు జీడీపీ వృద్ధి రేటు గత త్రైమాసికంలో 5 శాతంగా నమోదైంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతంగా నమోదు కావడం గమనార్హం. అయితే వచ్చే క్వార్టర్లో అంతకంటే తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. మరోవైపు మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నా కూడా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

చాలాకాలంగా కారు లేదా వాహనాల సేల్స్ తగ్గిపోవడం నుంచి మొదలు ఫ్యాక్టరీ ఉత్పత్తి, ఎగుమతులు తగ్గిపోవడం వంటి వివిధ అంశాలు భారత వ్యవస్థను తిరోగమనం వైపు నడిపిస్తున్నాయి. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే బీజేపీకి ప్రస్తుతం అంత అనుకూల పవనాలే ఏమి కనబడటం లేదు. మహారాష్ట్ర ఎపిసోడ్ రివర్స్ కావడంతో బీజేపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది. దీంతో రానున్న రోజుల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో కూడా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద చూసుకుంటే మోదీ 2.0 ప్రభుత్వానికి ఈ ఆరు నెలల్లో సక్సెస్ రేట్ పెరగలేదు…తగ్గలేదు.

Read more RELATED
Recommended to you

Latest news