అమరావతికి మోడీ శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు పూర్తయింది. అలానే రాజధాని గ్రామాల రైతులు,మహిళల నిరసనలు కూడా 310వ రోజుకి చేరుకున్నాయి. ఐదేళ్ల క్రితం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి ప్రధాని మోడి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు గుర్తుగా నేడు రాజధాని రైతులు, మహిళల వినూత్న నిరసనలు చేపట్టడానికి సిద్దం అయ్యారు.
అమరావతి-నాటి వైభవం-నేటి దుస్థితి పేరుతో శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు నిరసన చేయాలనీ అమరావతి ఉద్యమ జేఏసీ పిలుపునిచ్చింది. మరికాసేపట్లో రాయపూడి, మందడం నుంచి పాదయాత్రగా రాజధాని గ్రామాల రైతులు,మహిళలు శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి చేరుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు కూడా జేఏసీ ప్లాన్ చేసింది. అమరావతి చూపు-మోడి వైపు పేరుతో వినూత్న ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఈ రాత్రికి దీక్షా శిబిరాల వద్ద అమరావతి వెలుగు పేరుతో కాగడాల ప్రదర్శన కూడా చేపట్టనున్నారు.