కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు ఈ రోజుకి 25వ రోజుకు చేరుకున్నాయి. ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు పట్టువిడవకుండా నిరసనదీక్షలు కొనసాగిస్తున్నారు. మరో పక్క ఏమో ఈ చట్టాలతో ఎటువంటి నష్టం జరగదని, రైతులు లాభపడేందుకే చట్టాలను అమలు చేశామని కేంద్రం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే రైతులు, ప్రభుత్వానికి మధ్య పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలం కాలేదు.
కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చట్టాల మీద రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించిన బీజేపీ ఈ మేరకు చర్యలను ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని వాజ్ పేయీ జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25న ప్రధాని నరేంద్ర మోడీ రైతులతో ముచ్చటించనున్నట్టు సమాచారం. ఉత్తర ప్రదేశ్ లోని 2500లకు పైగా ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.