వర్షాకాలం.. కరోనా మహమ్మారి.. నిర్లక్ష్యం అస్సలే వద్దు..!

-

కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకీ ఉగ్ర రూపం దాలుస్తోంది. మన దేశంలో దాదాపుగా మార్చి నెల నుంచి దీని ప్రభావం ఎక్కువైంది. వేసవి ముగిసే సరికి ఈ వైరస్‌ ప్రభావం నశిస్తుందని అంతా భావించారు. కానీ వేసవి ముగిసి వర్షాకాలం ప్రారంభమైంది. కానీ కరోనా మాత్రం భీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన అన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై ఇంతకు ముందే ప్రసంగించారు. కరోనా మహమ్మారి + వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఇంతకు ముందు కన్నా మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని, అస్సలు నిర్లక్ష్యం వద్దని సూచించారు.

సాధారణంగా మన దేశంలో వర్షకాలం సీజన్‌ తనతోపాటు అనేక రకాల విష జ్వరాలు, వ్యాధులను మోసుకువస్తుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ ఇతర విష జ్వరాలు విజృంభిస్తాయి. ఈ నేపథ్యంలో వీటికి ప్రస్తుతం కరోనా కూడా తోడైంది. కనుక అస్సలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం, శుభ్రమైన ఆహారాలను తీసుకోవడం ద్వారా విష జ్వరాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అసలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పెద్ద ఎత్తున ముప్పు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రజలారా.. బీ కేర్‌ ఫుల్‌..!

వర్షాకాలంలో విష జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయి. వాటితో డెంగీ, మలేరియా వ్యాధులు వస్తాయి. కనుక దోమలు రాకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ కుండీలు, పాత టైర్లు, డ్రమ్ములు, కూలర్లలో ఉండే నీటిని పూర్తిగా తొలగించాలి.
2. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
3. దోమల నివారణకు దోమ తెరలు వాడాలి. సహజసిద్ధమైన మస్కిటో రీపెల్లెంట్స్‌ మార్కెట్‌లో లభిస్తున్నాయి. వాటిని వాడవచ్చు.
4. చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యం పట్ల ఇంట్లోని వారు శ్రద్ధ వహించాలి.
5. శుభ్రమైన నీటిని తాగాలి. నీటిని బాగా మరిగించి తాగితే మంచిది.
6. అప్పుడే వండిన వేడిగా ఉన్న ఆహారాన్నే తినాలి. ఆహారం చల్లగా అయ్యేకొద్దీ అందులో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. అలాంటి ఆహారం తింటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
7. బయటి పదార్థాలను తినడం మానేయాలి.
8. నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్‌, బయటి చిరుతిళ్లు తినరాదు.
9. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తినాలి. ఆకుకూరలు, పండ్లు, నట్స్ తీసుకోవాలి.
10. మాంసాన్ని బాగా కడిగి బాగా ఉడకబెట్టి తినాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version