తెల్లవారుతూనే మనకు తల పట్టేసినట్లుగా మాడు బద్దలవుతున్నట్లుగా నొప్పి వస్తే ఆ రోజంతా చిరాకుగా, బద్ధకంగా ఉంటుంది కదూ? ప్రతి చిన్నదానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మంచిది కాదు. అయితే ఈ ఉదయం మాడు నొప్పికి గల కారణాలు ఏమై ఉండవచ్చు? దానికి ఇంట్లోనే సులభంగా, సహజ పద్ధతుల్లో ఉపశమనం పొందడం ఎలాగో తెలుసుకుందాం!
మాడు నొప్పికి కారణాలు & ఉపశమనం: ఉదయం తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలు నిద్రలేమి, డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) లేదా కొంతమందికి కెఫిన్ అధికంగా తీసుకోవడం అలవాటై, ఉదయం తీసుకోకపోవడం వల్ల కూడా వస్తుంది. అంతేకాకుండా మెగ్నీషియం లోపం కూడా మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది.
తలనొప్పి వచ్చినప్పుడు చేయవలసినవి: హైడ్రేషన్,వెంటనే రెండు గ్లాసుల నీరు తాగండి. డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడానికి ఇది చాలా ముఖ్యం.

అల్లం ఔషధం: అల్లంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఒక టీస్పూన్ అల్లం రసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం లేదా అల్లం టీ తాగడం తక్షణ ఉపశమనం ఇస్తుంది.
మసాజ్ & విశ్రాంతి: నుదురు, మెడ వెనుక భాగంలో పుదీనా నూనె (Peppermint oil) లేదా లావెండర్ ఆయిల్‌తో సున్నితంగా మసాజ్ చేయడం మంచిది. ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణంలో కాసేపు విశ్రాంతి తీసుకోండి.
ఆరోగ్యకరమైన జీవనశైలితో నివారణ: తలనొప్పిని నివారించడంలో జీవనశైలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ 7-9 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి ఆహారాన్ని సమయానికి, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు వంటి నట్స్ రోజూ తినడం వలన తలనొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఇంట్లో పాటించే చిట్కాలతో ఉపశమనం లభించకపోతే, లేదా నొప్పి తరచుగా, తీవ్రంగా వస్తుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
