మరోసారి సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. తన ఆలేరు నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం సంతోషమని… వాసాలమర్రి గ్రామ దళితుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు మోత్కుపల్లి. దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అని… భారతదేశంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు.
అన్ని పార్టీలు దళితులను దళితులుగానే చూశారు తప్ప… నేరుగా దళితుల ఖాతాల్లో పది లక్షల రూపాయలు వేయడం ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి దళిత బంధు ఇస్తారనడానికి వాసాలమర్రె నిదర్శనమని ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు వారు అధికారంలో ఉన్న రాష్టాల్లో దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా? దళిత బంధు దేశం మొత్తం అమలు చేసే విధంగా జాతీయ పార్టీలు వారి అధిష్ఠానాలను ఒప్పించాలని తెలిపారు.హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అని దళిత బంధు పై అవాకులు చెవాకులు మాట్లాడిన వారు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని ఫైర్ అయ్యారు. దళితులకు ఆర్థిక పరిపుష్టి కల్పిస్తే రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారని తెలిపారు.