కర్ణాటక ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 31వ తేదీన బెంగళూరు నగరంలో మాంసం విక్రయాలు నిషేధిస్తూ ” బృహత్ బెంగళూరు మహానగర పాలికే” నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అసదుద్దీన్. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక ప్రభుత్వం సంపన్న వర్గాలకు కొమ్ముకాసే సర్కార్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం దృష్టిలో ఈ నిర్ణయం మంచిదే కావచ్చు.. కానీ ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. మాంసం విక్రయాలపై నిషేధం విధించడం హక్కులను కాలరాయడమేనని అసదుద్దీన్ పేర్కొన్నారు. కర్ణాటకలో 80% మంది మాంసాహారులు ఉన్నారని.. ఈ వ్యాపారం చేసేది ముస్లింలేనని, అందుకే బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.