ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ మరోసారి అధికారంలోకి రావడంతో.. ప్రస్తుతం ఆ పార్టీలోకి దేశ వ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్, టీడీపీలతోపాటు పలు ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరనున్న నాయకుల జాబితాలో రోజుకొకరి పేరు వినిపిస్తుండగా.. తాజాగా మల్కాజ్‌గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేరు కూడా అందులో వచ్చింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారగా..రేవంత్ రెడ్డి తాను పార్టీ మారే విషయంపై స్పష్టతనిచ్చారు.
తాను బీజేపీలో చేరుతున్న వస్తున్న ఊహాగానాలు, పుకార్లపై ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి స్పందించారు. బుర్ర ఉన్న వారెవరూ బీజేపీలోకి వెళ్లరని ఆయన అన్నారు. తాను బీజేపీలోకి వెళ్తే ప్రధానిని కాలేనని అన్నారు. కొందరు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన పట్ల తప్పుడు వార్తలను కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు తనను ప్రశ్నించే గొంతుకగా ఉండాలని తీర్పు ఇచ్చారని, అయితే తాను అలాగే ఉంటాను కానీ.. ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు.
ప్రజలు తనపై నమ్మకాన్ని ఉంచి తనను ఎంపీగా గెలిపిస్తే వారి తీర్పును కాదని వేరే పార్టీలో చేరడం సహేతుకం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. కాగా అంతకు ముందు రేవంత్ రెడ్డి కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా బాగుండాలని తాను భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్న పాలకులకు జ్ఞానోదయం కలగాలని తాను దేవున్ని ప్రార్థించానని రేవంత్ రెడ్డి తెలిపారు..!