రిటన్ గిఫ్ట్ లతో నగరవాసులను హడలెత్తిస్తున్న కమీషనర్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు రిటన్ గిఫ్ట్ లు నగరవాసులను హడలెత్తిస్తున్నాయి. కాకినాడ నగరవాసులు ప్రస్తుతం రిటర్న్ గిఫ్ట్‌ అంటేనే తెగ భయపడిపోయే పరిస్థితికి చేరుకున్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సప్నిల్ దినకర్ స్మార్ట్ సిటీ వాసులకు రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారు. ఐతే ఇవేమీ నిజమైన బహుమతులు కాదు. ఇది తప్పు చేసిన వారికి ఇచ్చే పనిష్మెంట్. ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల చైతన్యం తెచ్చేందుకు స్మార్ట్ సిటీ ప్రజలకు చెత్తనే రిటర్న్ గిఫ్టుగా అందిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా కాకినాడ స్మార్ట్ సిటీలోని అన్ని డివిజన్లలోని కొంతమంది ఇలాంటి రిటర్న్ గిఫ్టులు అందుకుంటున్నారు. ఇంటింటి చెత్త సేకరణ చేపట్టినా నగరవాసులు కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు, డ్రెయిన్లలో ఎక్కడపడితే అక్కడే చెత్త వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాకినాడ నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చెత్తను ఇష్టానుసారంగా డ్రెయిన్లలో వేయడం వల్ల కూడా ముంపు సమస్య తలెత్తినట్లు కమిషనర్ గుర్తించారు. పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, రోడ్లు, డ్రెయిన్లలో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని సంకల్పించారు. ఇందులో భాగంగా వినూత్నంగా ఆలోచించి రిటర్న్ గిఫ్ట్ పథకాన్ని ప్రారంభించారు. రిటర్న్ గిఫ్ట్ పథకంలో భాగంగా బాధ్యతారాహిత్యంగా రోడ్లు, డ్రెయిన్ల పై చెత్తవేసే వారిని గుర్తించి, ఆ చెత్తను వారికే బహుమతిగా ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్ వినూత్న కార్యక్రమం వల్ల ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది.