ఆయోధ్య వివాదాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు రఘవంశస్తులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కుమారుడైన కుశుడి వంశానికి చెందినవారమంటూ జైపుర్ రాజకుటుంబానికి చెందిన దియాకుమారి పేర్కొన్న మరుసటి రోజే మరో రాజకుటుంబం తాము రాముడి వంశస్థులమంటూ బయటకు వచ్చింది. మేవాడ్-ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. శ్రీరాముడి వంశానికి చెందిన వారసులెవరైనా ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం ప్రచార సాధనాల ద్వారా తెలిసింది.
మేం రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందిన వారమే అని ఆయన తెలిపారు. లవుడి పూర్వీకులు తొలుత గుజరాత్‌లో ఉండేవారు. ఆ తర్వాత అక్కడి నుంచి అహద్(మేవాడ్)కు వచ్చారు. అక్కడ శిసోడియా వంశాన్ని ఏర్పాటుచేశారు. తొలుత వారి రాజధాని ఛిత్తోడ్. తర్వాతి క్రమంలో దాన్ని ఉదయ్‌పూర్‌కు మార్చారు. అవసరమైతే ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, దస్ర్తాలను కోర్టుకు అందజేస్తాం అని మహేంద్రసింగ్ తెలిపారు. భాజపా ఎంపీ, జైపుర్ రాజకుమారి దియా కుమారి కూడా తాము కుశుడి వంశస్థులమంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయోధ్య కేసు విచారణ సమయంలో శ్రీరాముడి రఘువంశానికి చెందిన వారసులెవరైనా నేటికీ అయోధ్యలో నివసిస్తున్నారా అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు ఆమె స్పందించారు.
తమ కుటుంబం వద్ద ఉన్న పురాతన రాత ప్రతులు, వంశవృక్షం వివరాలు, పత్రాల ఆధారంగానే ఇలా చెప్పగలిగానని దియాకుమారి వెల్లడించారు. శ్రీరాముడి వంశస్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారన్నారు. ఇక ఇప్పటికే రాముడి కుమారులైన లవుడి, కుశుడికి చెందినవారమని పలువురు సాక్ష్యాలతో ముందుకు వస్తుండటంతో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూద్దాం.
– కేశవ