కర్ణాటక రాష్ట్రాన్ని గతకొద్ది రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరు నగరంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగళూరు, మైసూరు సహా పలు నగరాల్లో వరద నీరు ముంచెత్తుతోంది. తాజా వర్షాలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు రాజకోట(అంబా విలాస్ ప్యాలెస్).. రక్షణ గోడ కుప్పకూలింది. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు, నిపుణులు ఘటనాస్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కోటను మైసూరు రాజులు.. శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు నిర్మించారు.
పురావస్తు శాఖ అధికారులు.. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే గోడ కుప్పకూలిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోటలో అనేక చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని, అధికారులు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే ప్యాలెస్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మైసూర్ నగరంలో లాన్ స్టోన్ బిల్డింగ్, దేవరాజ మార్కెట్, ఫైర్ స్టేషన్ సహా పలు వారసత్వ కట్టడాలు కుప్పకూలాయి. వాటికి ఇంకా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు.