జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు నాగబాబు వచ్చే నెల (ఆగస్టు) 1న తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలో సత్తుపల్లి, అశ్వారావు పేటల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త ఒకరు రోడ్డు ప్రమాదానికి గురి కాగా… తన పర్యటనలో బాధితుడి కుటుంబానికి నాగబాబు ప్రమాద బీమాకు సంబంధించిన చెక్కును అందజేయనున్నారు. అనంతరం అశ్వారావుపేట వెళ్లనున్న నాగబాబు… అక్కడ స్థానిక నేతలు, జనసైనికులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. ఇదిలా ఉంటే.. అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన విషాదాంతంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా పూడిమడక వద్ద సముద్రతీరంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తిచేసుకున్న ఆ విద్యార్థులు మృత్యువాతపడడం ఆవేదన కలిగించిందని తెలిపారు. ఆ విద్యార్థుల భవిష్యత్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఈ విషాదం శోకాన్ని మిగిల్చిందని పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. సముద్ర తీరాలకు, నదీ తీరాల వద్దకు విహారానికి వెళ్లే విద్యార్థులు, యువత తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు పవన్.