టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ.. ఆయన జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ శ్రేణులు. అయితే.. ఇవాళ తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అందరూ గ్రహించాలని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు గానీ, ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గానీ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదన కానీ ఇవన్నీ చంద్రబాబు ప్రజల కోసం తలపెట్టిన పనులు అన్నారు. వీటినే ఈ వైసీపీ నేరాలు అంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గట్టిగా నిలదీసినందుకు అంగళ్ళు కేసు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినందుకే ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టుగా ఉందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయడం తప్పు అనే స్థాయికి రాజకీయం దిగజారిందంటే ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో తెలుసుకోవాలన్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా.. అసలు చంద్రబాబు ఏం తప్పు చేసారని జైల్లో పెట్టారని ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లో ఒకటే ఆవేదన అని, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసినందుకా? లేక ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలని తపించినందుకా? అదే తప్పైతే ఇక ప్రజలకు దిక్కెవరు? అని ఆమె ప్రశ్నించారు.