విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని.. వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు చేసి, యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు.
కార్మికుల విషయంలో సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం ఆనాడు కార్చింది మొసలి కన్నీరని అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తామని, యాజమాన్యానికి-కార్మికులకు మధ్య ఉన్న దళారీ వ్యవస్థను రద్దు చేసి విద్యుత్ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తాను హామీ ఇవ్వలేదని అనేందుకు అవకాశం లేకుండా అన్నీ రికార్డెడ్‌గా ఉన్నాయని లోకేశ్ స్పష్టం చేశారు.
‘‘మోసపూరిత హామీలిచ్చిన మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకి ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకుతెచ్చుకొని నెరవేర్చేందుకు కృషి చేయాలని కోరుతున్నాం. ’’అని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.