టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని రంగన్నగూడెం వద్ద పట్టిసీమ కాలువను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమతో కృష్ణా డెల్టా నీటికష్టాలు తీర్చిన అపర భగీరథుడు అన్నారు. దేశచరిత్రలో తొలిసారిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని నారా లోకేశ్ కొనియాడారు. కృష్ణాడెల్టాలో రైతుల కష్టాలు తీర్చేందుకు కేవలం 11నెలల వ్యధిలో రూ.1,360 కోట్ల వ్యయంతో 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేసిందని నారా లోకేశ్ చెప్పారు.
రికార్డు సమయంలో పూర్తయిన ప్రాజెక్టుగా కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం పొందిందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ఫలితాలను 2016-19 మధ్య మూడు సీజన్లలో రైతులు కళ్లారా చూశారని చెప్పారు నారా లోకేశ్. రోజూ గరిష్ఠంగా 8500 క్యూసెక్కుల (0.73 టీఎంసీలు) నీటిని తీసుకునేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 100 టీఎంసీల మిగులు జలాలను గోదావరి నుంచి కృష్ణాకు తీసుకునే అవకాశముందన్నారు. నాడు దండగ అన్న జగన్‌కు నేడు పట్టిసీమే దిక్కయిందని లోకేశ్ విమర్శించారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టును పట్టించుకోకుండా చేతులుకాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దార్శనికతకు పట్టిసీమ నిదర్శనమని స్పష్టం చేశారు నారా లోకేశ్.