సాధారణంగా ఎవరైనా సరే.. ట్యూబ్‌లైట్లను ఒక్కసారి వాడాక అవి పాడైతే వాటిని చెత్త కుప్పల్లో పారేస్తారు తప్ప వాటిని రిపేర్ చేయించి ఎవరూ వాడరు. అయితే నిజానికి ఆలోచించాలే కానీ.. వాటినీ రిపేర్ చేసి భేషుగ్గా ఎక్కువ కాలం పాటు వాడవచ్చు. అవును.. నమ్మలేకున్నా.. ఇది నిజమే. ఎందుకంటే.. నిజామాబాద్‌కు చెందిన నరసింహ చారి అనే వ్యక్తి పాడైపోయిన ట్యూబ్‌లైట్లను బాగు చేస్తారు. వాటికి ప్రాణం పోస్తారు. అలా ఆయన ఇప్పటికే ఎన్నో లక్షల ట్యూబ్‌లైట్లకు రిపేర్లు కూడా చేశారు..!
నిజామాబాద్‌లోని నవీపేట టౌన్‌కు చెందిన 39 ఏళ్ల మండాజి నరసింహ చారికి చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ వస్తువులను రిపేర్ చేయడమంటే ఆసక్తి ఎక్కువ. ఆయన 7వ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక సారి రోడ్డు పక్కన కుప్పగా పడేసి ఉన్న ట్యూబ్‌లైట్లను చూశారు. వాటిని రిపేర్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పట్లో అది వీలు కాలేదు. ఎప్పటికప్పుడు వాటిని ఎలా రిపేర్ చేయాలా..? అని ఆలోచించేవారు. అందుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా లైబ్రరీలో పుస్తకాలు చదివి తెలుసుకునేవారు. అయితే ఎట్టకేలకు ఆయన ఓపెన్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక.. ట్యూబ్‌లైట్లను రిపేర్ చేయడం మొదలు పెట్టారు.
ట్యూబ్‌లైట్లను రిపేర్ చేసేందుకు గాను చారి ఓ సర్క్యూట్‌ను తయారు చేశారు. దానికి ఆయన పేటెంట్ కూడా పొందారు. దాని సహాయంతో ఆయన పాడైపోయిన ట్యూబ్‌లైట్లను బాగు చేసే వారు. వాటిని మళ్లీ 5 ఏళ్ల వరకు ఉపయోగించుకునేందుకు వీలు కలిగింది. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటి వరకు ఏకంగా 10 లక్షల పాడపోయిన ట్యూబ్‌లైట్లను బాగు చేశారు. అందుకు గాను ఆయనకు పలు అవార్డులు కూడా దక్కాయి. అయితే పాడైన ట్యూబ్‌లైట్లను పడేయడం వల్ల వాటిలో ఉండే మెర్క్యురీ పర్యావరణానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. కానీ చారి చేస్తున్న పని వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. కాగా చారి ప్రస్తుతం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్ఐఆర్‌డీ)లో ఓ ప్రాజెక్టు నిమిత్తం పనిచేస్తున్నారు. అది విజయవంతమైతే మనిషి జీవితం ఎంతగానో మారిపోతుందని ఆయన చెబుతున్నారు. దాని గురించిన వివరాలను ఆయన వెల్లడించలేదు కానీ.. ఆయన తన ప్రాజెక్టులో విజయవంతం కావాలని మనమూ ఆశిద్దాం..!