ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విషయం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. ఆయన తీసుకుం టున్న నిర్ణయాల్లో తప్పులను వెతికే కార్యక్రమానికి ఏపీలోని కొన్ని విపక్షాలు పని గట్టుకుని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వీటి సాయం పొందిన, పొందుతున్న కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు జగన్ను కేంద్రంగా చేసుకుని వార్తలు, వ్యాసాలు, ఆఖరుకు సంపాదకీయాలు కూడా రాస్తున్నాయి. సరే ఇవన్నీ ఇలా ఉంటే.. ఏపీలో విపక్షాలు రాజధానుల విషయంలో చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. తాము గడిచిన 33 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామని, అయినా కూడా జగన్ ప్రభుత్వం స్పందించడం లేదని వీటి వాదన.
అదే సమయంలో జగన్‌పై వ్యక్తిగత విమర్శల నుంచి నిక్ నేమ్స్ పెట్టడం వరకు కూడా ఈ పార్టీలు పోటీ పడుతున్నాయి. తాము ఇంతగా విమర్శిస్తున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి విమర్శలూ లేకపోవడం, మంత్రులు సైతం సబ్జెక్టుకే పరిమితం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయా పార్టీలో ఆగ్రహం, కసి కట్టలు తెగుతోంది. దీంతో జగన్ సర్కారు తమ విమర్శలకుప్రతి విమర్శలు చేయాలని, వాటిని అడ్డు పెట్టు కుని మరింతగా తాము దూకుడు చూపించాలని సీపీఐ, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ప్రయత్నిస్తున్నా యి. అయితే, జగన్ మాత్రం ఒక్క మాట కూడా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం లేదు.
దీనిని గమనిస్తున్న విశ్లేషకులు విపక్షాలు జగన్ నుంచి ఆయన మంత్రి వర్గం నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తు న్నారని అంటున్నారు. అయితే, జగన్ మాత్రం కేవలం తాను చేయాలని అనుకున్న పనిని చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరినీ ఆయన పట్టించుకోవడం లేదు. నిజానికి చెప్పాలంటే.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలో లేని సమయంలోనూ విపక్షాలను, వారి విమర్శలను ఆయన పట్టించుకో లేదు. ప్రజాస్వామ్యంలో ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం మంచిది కాదని, దీనివల్ల ఆయనకు ప్రజలపై నమ్మకం లేదనే బావన వస్తుందని పెద్ద ఎత్తున ఎన్నికల సమయంలో ఈ పార్టీలన్నీ వ్యతిరేక ప్రచారం చేశాయి.
అయితే, జగన్ మాత్రం వీరి విమర్శలను పట్టించుకోలేదు. ప్రజల మధ్యకు వెళ్లారు. వారినే తనకు ఓ ఛాన్స్ ఇవ్వమని అడిగారు. సో.. ప్రజలతో జగన్ రాజకీయంగా , ఆత్మీయంగా బంధం పెట్టుకున్నారే తప్ప.. విపక్షాలతో కాదనే విషయం ఈ నేతలు గుర్తించాలి. సో.. ఇకమీదట కూడా జగన్‌కు ప్రజలే ముఖ్యమనే విషయం గమనించాలని అంటున్నారు పరిశీలకులు.