బిహార్లో 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. భారీ వ్యయంతో నిర్మించిన ఈ వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వంతెనల పూడిక తీత పనులను దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే ఈ ఘటనలకు కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ ప్రాథమికంగా నిర్ధరించారు.
తాజాగా సరన్ జిల్లాలో భారీ వంతెన కూలిపోయింది. గత 17 రోజుల వ్యవధిలో ఇది పన్నెండోది. గతంలో శివన్, సరన్, మధుబాణి, అరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణగంజ్ జిల్లాల్లో వంతెనలు కూలిపోయిన విషయం తెలిసిందే. జులై 3, 4 తేదీల్లో శివన్, సరన్ జిల్లాల్లోని గండక్ నదిపై నిర్మించిన ఆరు బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి పూడికతీత సమయంలో ఇంజినీర్లు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, అదే సమయంలో గుత్తేదారు కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడమే కారణమని అనిపిస్తోంది చైతన్య ప్రసాద్ అన్నారు. అయితే కూలిన వంతెనల స్థానంలోనే కొత్త వంతెనలు నిర్మిస్తామని, ఆ భారాన్ని గుత్తేదారుపైనే మోపుతామని చెప్పారు. మరోవైపు బిహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోవడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సీఎం నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది.