కర్ణాటకలో మంత్రులు, ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్’ (Honey Trap) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై శుక్రవారం రోజున కర్ణాటక అసెంబ్లీలో రగడ జరిగింది. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారని ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్ష బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శించారు. ఈ క్రమంలో స్పీకర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. బీజేపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యక్రమాలు అడ్డుకున్నందుకు, అధ్యక్షుడి స్థానాన్ని కించపరిచినందుకే వారిని ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.