బెట్టింగ్ యాప్ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు పలువురు సెలబ్రిటీలు, సినీ తారలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న యాంకర్, నటి శ్యామల తాజాగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసేలా ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు శ్యామల.
ఈ పిటిషన్ పై తాజాగా హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. శ్యామలను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసుల విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు సూచించింది. సోమవారం నుంచి ఈ కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ విషయంలో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించొచ్చని సూచించింది. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ తారలు రానా, విజయ్ దేవరకొండలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే వారి కేవలం స్కిల్ బేస్డ్ యాప్స్ కు మాత్రమే ప్రచారం చేశారంటూ వారి పీఆర్ టీమ్స్ ఇప్పటికే ప్రకటనలు జారీ చేశాయి.