18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి విడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపికకు జరగనుంది. కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఈసారి మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుంది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇందుకోసం నామినేషన్లను స్వీకరించనున్నట్లు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే ఓటింగ్ జరుగుతుంది. లేదంటే ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికవుతారు. అనంతరం 27 నుంచి రాజ్యసభ 264వ సెషన్ ప్రారంభమవుతుంది. ఆరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు.రాబోయే ఐదేళ్లలో కొత్త ప్రభుత్వం చేపట్టబోయే రోడ్ మ్యాప్‌ను ముర్ము తన ప్రసంగంలో వివరిస్తారు. రాష్ట్రపతి అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను పార్లమెంటుకు పరిచయం చేస్తారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, దానికి ప్రధాని సమాధానం వంటివి ఉంటాయి.