భారత్‌లో వాయు కాలుష్యంతో ఏటా 21 లక్షల మంది బలి

-

భారత్​లో వాయు కాలుష్యంతో ఏటా 21.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారట. ఆరు బయట చోటుచేసుకుంటున్న వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని జర్మనీలోని మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలు బీఎంజే మెడికల్ మేగజైన్ ప్రచురించింది.

ఈ మేగజైన్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఆరుబయట జరుగుతున్న వాయు కాలుష్యంతో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువగా మరణాలు చోటుచేసుకుంటున్నాయట. ముఖ్యంగా చైనాలో ఏటా 24.4 లక్షల మంది చనిపోతుండగా.. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ ఉన్నట్లు తేలింది. ఈ మరణాల్లో ఎక్కువ భాగం.. గుండె జబ్బులు (52 శాతం), పక్షవాతం (30 శాతం), ఊపిరితిత్తుల వ్యాధి (16 శాతం), మధుమేహం (6 శాతం)తో చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా వంటి రంగాల్లో శిలాజ ఇంధనాల వల్ల జరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా 51 లక్షల మంది చనిపోతున్నారని మెడికల్ మేగజైన్ ప్రచురించిన కథనం వెల్లడించింది. . శిలాజ ఇంధనాల స్థానంలో శుద్ధ, పునరుత్పాదక ఇంధనాలను వినియోగిస్తే ఈ చావులను తగ్గించవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news