మహారాష్ట్రలోని చిఖ్లి అనే ప్రాంతంలో 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అక్కడి పింప్రి-చించివాడకు చెందిన పోలీసులు ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ఇత్తడి వస్తువు కూడా లభ్యమైంది. కాగా ఆ నాణేల బరువు సుమారుగా 2,357 గ్రాములు ఉంటుందని వెల్లడైంది. ఇత్తడి పాత్ర బరువు 525 గ్రాములు ఉంటుందని అంచనా వేశారు. సదరు నాణేలు 1720 నుంచి 1750 సంవత్సరాల కాలానికి చెందినవని పురావస్తు శాఖ అధికారులు నిర్దారించారు.
ఆ నాణేల మీద రాజా మహమ్మద్ షా అనే పేరుతోపాటు కొన్ని అక్షరాలు ఉర్దూ, అరబిక్ భాషల్లో రాసి ఉన్నాయని అక్కడి పోలీస్ కమిషనర్ కృష్ణ ప్రకాష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా ఒక్కో బంగారు నాణెం విలువ సుమారుగా రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఉంటుందని, ఈ క్రమంలో మొత్తం నాణేల విలువ దాదాపుగా రూ.1.30 కోట్లకు పైగానే ఉంటుందని నిర్దారించారు.
అయితే అదే ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ భవన నిర్మాణ పనిలో భాగంగా కూలి పనిచేస్తూ తవ్వకాలు జరపగా ఆ నాణేలు బయటపడ్డాయి. అయితే వాటిని వారు ఒక ఇంటిలో 3-4 నెలల నుంచి దాచారు. కానీ వారిలో వారికి నాణేలను పంచుకోవడంలో తేడాలు వచ్చాయి. దీంతో సమాచారం బయటకు పొక్కింది. ఫలితంగా పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో వారు ఆ ఇంటిపై దాడి చేసి అందులో దాచి ఉంచిన నాణేలను, ఇత్తడి పాత్రను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు.