ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. కుంభవృష్టి కురుస్తుండటంతో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంతో పాటు మరికొన్ని ప్రాంతాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో వరణుడు బీభత్సం సృష్టించాడు. ఆ రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాటు కారణంగా 38 మంది మృతి చెందారు. మరికొందరకి తీవ్ర గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు.
పిడుగుపాటు వల్ల ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు యూపీలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో యూపీ సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు ముంబయి నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాబోయే మూడు రోజులు ముంబయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.