ఆదాయపు పన్ను ఎగువేస్తున్న లిక్కర్ వ్యాపారులైప ఐటీ అధికారులు రెండ్రోజులుగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న లిక్కర్ వ్యాపారి అరవింద్ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరికినట్లు సమాచారం. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల వెల్లడించలేదు.
మరోవైపు భువనేశ్వర్, సుందర్‌గఢ్, బౌద్ధ్ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. టిట్లాగఢ్ పట్టణంలో ఉంటున్న దీపక్ సాహు, సంజయ్ సాహు, రాకేశ్ సాహుల ఇళ్లలో రెండురోజుల తనిఖీల్లో రూ.510 కోట్ల నగదు పట్టుబడినట్లు ఐటీ అధికారులు తెలిపారు. బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయామన్నారు. ఈ నగదును సీజ్ చేసి బొలంగీర్ ఎస్‌బీఐ శాఖకు తరలించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతోపాటు ఝార్ఖండ్, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.