గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. సచిన్ పాలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇంకా కొంతమంది శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆ భవనం, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
శనివారం రోజున జరిగిన ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించారని, మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని వెల్లడించారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలో ఉండకూడదని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని సూచించారు.