భారత్‌లో చాలా ప్రాంతాలు వడగాల్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని ఐపీఈ గ్లోబల్ లిమిటెడ్, ఎస్రీ ఇండియా టెక్నాలజీస్ సంస్థల తాజా పరిశోధనలో తేలింది. దాదాపుగా దేశవ్యాప్తంగా 84 శాతానికిపైగా జిల్లాలు తీవ్రస్థాయి వడగాల్పుల ముప్పును ఎదుర్కొంటున్నాయని .. 70 శాతం జిల్లాల్లో అసాధారణస్థాయి వర్షపాతాల తాకిడి పెరుగుతోందని.. జూన్-సెప్టెంబరు కాలంలో దేశంలో వేసవి తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని ఈ నివేదిక పేర్కొంది. 2036 నాటికి ప్రతి 10 మంది భారతీయుల్లో 8 మంది.. అసాధారణ వాతావరణ పోకడల ప్రభావానికి గురవుతారని తెలిపింది.
రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, త్రిపుర రాష్ట్రాలు 2013-22 మధ్య దేశంలో తీవ్రస్థాయి వడగాల్పులను ఎదుర్కొన్న మొదటి ఐదు స్థానాల్లో ఉండగా.. తీర ప్రాంతాల్లోని 74 శాతం జిల్లాలు, మైదాన ప్రాంతంలోని 71 శాతం జిల్లాలు, పర్వత ప్రాంతాల్లోని 65 శాతం జిల్లాలు తీవ్ర వేడిమిని ఎదుర్కొన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. 2013-22 మధ్య వడదెబ్బతో దేశవ్యాప్తంగా 10,635 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2,203 మంది, ఉత్తర్‌ప్రదేశ్ (1,485 మంది), తెలంగాణ (1,172 మంది) బలయ్యారు.