ఈ మధ్యకాలంలో వృద్ధాశ్రమాలు పుట్టగొడుగుల్లా వచ్చేస్తున్నాయి. వృద్ధులైన వారికి సరైన ఆశ్రయం లేక కూడా వృద్ధాశ్రమాలు వెలవడానికి కారణం అవుతున్నాయి. ముసలితనంలో వారికి సహాయపడుతూ వారి ఇబ్బందులని తీర్చడం గొప్ప పనే. కానీ కొన్ని వృద్ధాశ్రమాల్లో అలా జరగట్లేదు. సేవ కార్యక్రమం అని చెప్పి, విరాళాలు సేకరించి వృద్ధులకి సరైన సేవ చేయక ఇబ్బంది పెడుతున్నాయి కొన్ని వృద్ధాశ్రమాలు. ప్రస్తుతం వారిని శిక్షించేందుకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది.
రిజిస్ట్రేషన్ లేకుండా వృద్ధాశ్రమం నిర్వహించినా, అందులో ఉన్న వారికి నాసిరకమైన సేవలు అందించినా, అమర్యాదగా ప్రవర్తిస్తూ వారి పట్ల కఠినంగా ఉన్నా ఏడాది జైలు శిక్ష పడడంతో పాటు భారీ జరిమానా విధించాలని చట్టం చేయనున్నారు. ఈ మేరకు బిల్లుని కేబినేట్ ముందుంచనున్నారు. ఇకపై వృద్ధాశ్రమాల్లో వృద్ధులపై అనవసరంగా అరవడం లాంటివి, వారిని ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడకూడదని చట్టం తెస్తున్నారు.