ఉత్తర్ప్రదేశ్.. దేవరియా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదం వల్ల ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఇవాళ జరిగిన ఈ దారుణ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి పరుగులు తీశారు. ఈ దారుణహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేపుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లెధాన్ టోలె ప్రాంతంలో సత్యప్రకాశ్ దుబే అనే వ్యక్తికి అభయ్పురా టోలెకు చెందిన మాజీ జిల్లా పంచాయజీ సభ్యడు ప్రేమ్చంద్ మధ్య కొంత కాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ప్రేమ్చంద్ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఈ పని సత్యప్రకాశ్ చేశాడని కోపంతో ఊగిపోయిన కొందరు దుండగులు.. అతడి ఇంటిపై దాడికి దిగి సత్యప్రకాశ్తో పాటు అతడి భార్యాపిల్లలు సహా ఇంట్లో ఉన్న మరో వ్యక్తిని హతమార్చారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.