ఇండియా కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ మరో గట్టి షాక్ ఇచ్చింది. సీట్ల సర్దుబాటు చర్చలతో విసిగిపోయిన ఆ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కూటమిలోని మిగిలిన పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా అసోం నుంచి ఆప్ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రూగఢ్, గువాహటి, సొంటిపూర్ నియోజక వర్గాలకు అభ్యర్థులను పేర్లను దిల్లీలో ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ప్రకటించారు.
దిబ్రూగఢ్ నుంచి మనోజ్ ధనోహర్, గువాహటి నుంచి భవెన్ చౌదరి, సోంటిపూర్ నుంచి రిషి రాజ్ బరిలోకి దిగనున్నట్లు సందీప్ పాఠక్ తెలిపారు. ఇండియా కూటమి తమ నిర్ణయాన్ని స్వాగతిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమితో జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోయామని అందుకే తమ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని వెల్లడించారు. అయితే తాము కూటమితోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉందని, మూడు స్థానాలకు వెంటనే సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.