దేశ రాజధాని దిల్లీలో మరోసారి రైతుల పోరుబాట ఉద్రిక్తతకు దారి తీసింది. ప్లాట్లుగా అభివృద్ధి చేస్తామని నమ్మించి తమ భూమిని స్థానిక ప్రభుత్వాలు దోచుకున్నాయని, తగినంత పరిహారం చెల్లించలేదని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంత రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీ సంఖ్యలో బలగాలను మోహరించి ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దింపారు.
ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి నగరంలోకి అనుమతిస్తున్నారు. ఈక్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. భారీ సంఖ్యలో రైతులు మోహరించడంతో ఊహించని పరిణామాలు ఎదురైతే ఎదుర్కొనేందుకు వీలుగా అల్లర్ల నియంత్రణ వాహనాలను, జల ఫిరంగులను పోలీసులు సిద్ధం చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి పరిస్థితులను నియంత్రిస్తున్నారు. రైతులు గుమిగూడకుండా అడ్డుకుంటున్నారు. దిల్లీలో గత మూడేళ్లలో ఇంత భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు దిల్లీ శివార్లలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.