‘అరెస్టయినా సరే.. మీరే సీఎంగా కొనసాగాలి’ : కేజ్రీవాల్‌ను కోరిన ఎమ్మెల్యేలు

-

దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ పాలసీలో ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయణ్ను ఏదైనా దర్యాప్తు సంస్థ అరెస్టు చేసినా.. దిల్లీ సీఎంగా ఆయనే కొనసాగాలని కేజ్రీవాల్ ను ఆప్ ఎమ్మెల్యేలు కోరినట్లు ఆ పార్టీ తెలిపింది. సోమవారం రోజున దిల్లీ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ఆప్‌ ఎమ్మెల్యేలంతా అత్యవసరంగా భేటీ అయ్యారు.  ఈమధ్య కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మంత్రులు, నేతలపై వ్యవహరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు.

ఈ భేటీ అనంతరం దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొన్న ఆప్‌ ఎమ్మెల్యేలందరూ  కేజ్రీవాల్‌ ఒకవేళ అరెస్టయితే.. దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఆయన్నే సీఎంగా కొనసాగాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. అర్వింద్‌ కేజ్రీవాల్‌ని చూసి బీజేపీ, ప్రధాని మోదీ భయపడుతున్నారని వారంతా అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎన్నికల ద్వారా కేజ్రీవాల్‌కు అధికారం దూరం చేయలేమని కమలదళానికి తెలుసని.. అందుకే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ అరెస్టయితే అధికారులు సమావేశాల కోసం జైలు వద్దకే వెళ్తారని.. జైలులోనే కేబినెట్‌ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కేజ్రీవాల్‌ని ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తే  జైలు నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగించేలా అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version