ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలన్న పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. అయితే దీనిపై జులై చివరి వారంలో విచారణ చేపడతామని జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.
అయితే ఈ కేసు విచారణ తెలంగాణలో కాకుండా మధ్యప్రదేశ్‌లో జరిగేలా బదిలీ చేయాలని ఈ ఏడాది జనవరి 31న బీఆర్‌ఎస్ నేతలు గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహ్మద్ అలీ, కల్వకుంట్ల సంజయ్‌లు ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆ సమయంలో ఆదేశించింది.