రాజకీయాల్లో ఒకే ఇంట్లో ఉండే వారు వేరు వేరు పార్టీల తరఫున ఎన్నికల బరిలో నిలవటం సర్వ సాధారణం. చివరికి భార్యాభర్తలు సైతం ప్రత్యర్థులుగా పోటీ పడిన సందర్భాలున్నాయి. అయితే అలాంటి సమయంలో.. కుటుంబ సభ్యుల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంటుంది. ఎవరి వైపు ప్రచారం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక సెలబ్రేటీలు అయితే ఈ బాధ వర్ణనాతీతం. ప్రస్తుతం ఇదే పరిస్థితి విక్టరీ వెంకటేష్‌కు ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరు సమీప బంధువులు పోటీ చేస్తున్నారు. అయితే… వారిద్దరు కూడా వేరు వేరు పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. దీంతో హీరో వెంకటేష్ ఎవరికి మద్దతు ఇస్తాడనేది అటు రాజకీయాల్లో, ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం హేమాహేమీలు పోటీ పడ్డారు. తప్పకుండా గెలిచే సీటు కావడంతో… మాకే కావాలంటూ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడ్డారు. భార్య కోసం భట్టి విక్రమార్క, తమ్ముడి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బంధువు కోసం తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ప్రయత్నించారు. అదే సమయంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు మరికొందరు సీనియర్లు కూడా ఖమ్మం టికెట్ కోసం యత్నించారు. అయితే వీళ్లందరిని కాదని… రఘురామిరెడ్డికి టికెట్ కేటాయించింది హస్తం పార్టీ అధిష్ఠానం. ఆయన కూడా పొంగులేటికి వియ్యంకుడు కావడంతో మిగిలిన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. ఇదే సమయంలో రఘురామిరెడ్డి హీరో వెంకటేష్‌కు కూడా వియ్యంకుడే. వెంకటేష్ కుమార్తె ఆశ్రితను రఘురామిరెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో రఘురామరెడ్డి తరఫున ఇప్పటికే ఆశ్రిత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు ఏపీలోని కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈయన కూడా వెంకటేష్‌కు బంధువే. వెంకటేష్ భార్యకు కామినేని శ్రీనివాస్ స్వయాన మేనమామ. దీంతో వెంకటేష్‌కు బాబాయ్ అవుతారు. ఇప్పటికే కామినేని శ్రీనివాస్ తరఫున పలువురు కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే బాబాయ్ కోసం అబ్బాయి వెంకటేష్ వస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీలో రెండు విభిన్న పార్టీలు కావడంతో.. ఒకరి తరఫున ప్రచారం చేస్తే… మరొకరిని విమర్శించాల్సిందే. దీంతో ఎవరి తరఫున ప్రచారం చేస్తే ఏం తంటా వస్తుందో అని వెంకీ మామ సైలెంట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు సన్నిహితులు.