ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఏకంగా మోదీని దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీలతో పోల్చారు. రాజీవ్ గాంధీలాగే.. మోదీ కూడా ప్రధానిగా.. ప్రపంచవ్యాప్తంగా కీర్తిని సంపాదించారని అజిత్ పవార్ కొనియాడారు. ప్రధాని మోదీ ‘లోక్‌మాన్య తిలక్ జాతీయ పురస్కారం’ అందుకున్న అనంతరం విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడారు.
ఏ ప్రధానమంత్రి అయినా దేశంలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తారని.. మణిపుర్ ఘటనను ఎవరూ సమర్థించరని అజిత్ పవార్ అన్నారు. ఈ విషయం ప్రధాని దృషికి వచ్చిందని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా ఈ అంశంపై విచారణ చేపట్టిందని.. అక్కడ జరిగిన ఘోరాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని అన్నారు. దోషులకు శిక్ష పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న పాపులారిటీ మరే నాయకుడికి లేదని కొనియాడారు. తొమ్మిదేళ్లుగా దేశం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారని.. దాని ఫలితంగా ప్రపంచస్థాయిలో భారత్‌కు మంచి గౌరవం లభిస్తోందని అజిత్ పవార్ అన్నారు.