కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌పై అమెరికా స్పందించింది. ఈ అంశం తమని ఆందోళనకు గురిచేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రమని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ – 2019ను తీసుకొచ్చింది. దీనికి 2019లోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించగా విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంతో వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలకు ముందు దీని అమలు విధివిధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల ముస్లింల పౌరసత్వం పోదని స్పష్టం చేసింది.