ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. భారత్‌పై కెనడా తీవ్ర ఆరోపణలు చేస్తుండటం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా పరిణామాలపై పలు దేశాలు స్పందిస్తున్నాయి.
తాజాగా అమెరికాలోని కొంతమంది నిపుణులు కెనెడా ప్రధాని ట్రూడో తీరును తప్పుబట్టారు. భారత్‌పై ఆయన చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు జోక్యం చేసుకోవద్దని.. ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. భారత్-కెనడా మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై వాషింగ్టన్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ చర్చా కార్యక్రమం జరిగింది.
ఇందులో మాట్లాడిన పలువురు నిపుణులు.. ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్‌ను లాగుతూ అతడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని.. మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఆస్ట్రేలియా కూడా స్పందించింది. భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని తెలిపింది.