అమిత్ షా వద్దట.. యోగీ ముద్దట..ఎందుకనీ..?

-

ఈ మధ్య సోషల్ మీడియాలో ‘ అమిత్ షా వద్దు.. యోగీ ముద్దు. యోగీని కేంద్ర హోం‌మంత్రిని చేసి బుల్ డోజర్ పవర్ ఇచ్చి చూడండి’ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ సందేశం వైరల్ అవుతోంది. సాదాసీదాగా.. ఏదో యోగీపై ప్రేమతో ఇలా ఎవరో ఈ సందేశాన్ని షేర్ చేసి ఉండొచ్చని అనుకోవచ్చు.కానీ.. బీజేపీని గట్టిగా అభిమానించే.. అమిత్ షా అంటే పడిచచ్చే నేతలు కూడా ఈ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు.

తమదైనరీతిలో భాష్యాలు జోడిస్తూ ఈ ట్యాగ్ లైన్ ను తమ టైమ్ లైన్లలో షేర్ చేస్తున్నారు. నిజానికి.. బీజేపీ గురించి ఎవరెన్ని చెప్పినా ఆ పార్టీలోని నేతలు పార్టీ నియమావళి, క్రమశిక్షణ సూత్రాలకు కట్టుబడాల్సిందే. కానీ అందుకు భిన్నంగా.. ఏకంగా అమిత్ షానే టార్గెట్ చేస్తూ.. ఆయన పనితనాన్ని, సమర్థతతను తక్కువ చేసేలా ఉన్న ఈ సందేశాన్ని పార్టీ అభిమానులు షేర్ చేయడం వెనుక ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మొన్న జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ మినహా మిగతా అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను మార్చారు.

ఆయా సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడంతో బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి వ్యతిరేకతే యోగి పట్ల కూడా వ్యక్తమైనా బీజేపీ అధిష్ఠానం ఏమీ చేయలేకపోయింది. యోగీని మార్చేందుకు ప్రయత్నించినా.. అందుకు ఆయన మొండికేయడమేగాక.. తనను తీసేస్తే సొంత పార్టీ పెట్టుకుంటానన్న సంకేతాలు కూడా ఇచ్చారు. యోగీ పవర్ ఏమిటో తెలిసిన మోదీ, అమిత్ షా కూడా ఆయనకు స్థాన చలనం కలిగించకుండా ప్రచార బాధ్యతలు మరో కీలక నేతకు అప్పగించారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన యోగి తన పవర్ ఏంటో చూపిస్తున్నారు.

ఏకంగా ఎస్పీ ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంక్ ను అనుమతులు లేవనే కారణంతో బుల్డోజర్లతో కూల్చేయించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో సహా 13 మంది విపక్ష నేతలు దేశ ప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో ..బీజేపీ పాలనలో విద్వేషం, మతతత్వం, మతోన్మాదం విస్తరిస్తున్నాయని, ప్రజల మధ్య విభేదాలు రాజేసి ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బీజేపీకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని, లేదంటే ఇండియా మరో వందేళ్లు వెనక్కి పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

అదే స‌మ‌యంలో మొన్న‌టి శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా వివిధ ప్రాంతాల‌లో.. ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల‌లో అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. రాళ్ల దాడి కూడా జ‌రిగింది. కేంద్ర హోం మంత్రి అధీనంలో ఉండే ఢిల్లీలోనూ ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. కానీ యూపీలో దాదాపు 800 చోట్ల ర్యాలీలు జ‌రిగితే ఎక్క‌డా కూడా ఎలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌లేదు. ఈ రెండు ఉదంతాల‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న యోగీ అభిమానులు ఏకంగా.. అమిత్ షా లక్ష్యంగా విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా తమ నేత పట్ల చూపిన తిరస్కార ధోరణికి నిరసన అన్నట్లుగా ‘‘అమిత్ షా వద్దు.. యోగి ముద్దు.. బుల్డోజర్ పవర్’’ చూపించాలని పేర్కొంటున్నారు. అయితే అత్యున్న‌త స్థాయిలోని ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తోందని కొంద‌ర‌ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version