బీజేపీకి ఎలాంటి ప్లాన్ బీ లేదని, అద్భుతమైన మెజారిటీతో మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400 కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. గత పదేళ్లుగా తమకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉందని, కానీ ఎప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలనుకోలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.
రాజ్యాంగంలో మార్పులు చేస్తామని రాహుల్ బాబా అండ్ కంపెనీ దుష్ప్రచారం చేస్తుందని అమిత్ షా అన్నారు. దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంత మంది పేదలకు భరోసా ఇవ్వడానికి 400 సీట్లను ఎన్డీఏ గెలవాలని తెలిపారు. ఎందుకంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇంకా అందలేదని, 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నామని చెప్పారు. రాహుల్ బాబా వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరన్న షా.. దేశంలోని యువత 30 ఏళ్లుగా అస్థిర ప్రభుత్వాలను చూశారని, మోదీ హయాంలో సుస్థిర ప్రభుత్వాలను రెండు దఫాలుగా చూశారని చెప్పారు. మరోసారి స్థిరమైన ప్రభుత్వం దేశంలో ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు.