ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్థానీ కోసం కట్టుకున్న భర్తను.. కన్నబిడ్డలను వదిలేసి ఆ దేశానికి వెళ్లిన అంజు మరికొద్ది రోజుల్లో ఇండియాకు రానుందట. భర్త, పిల్లలను వదిలేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడి యువకుడిని పెళ్లాడిన అంజు (34) తన పిల్లలను మిస్ అవుతోందట. వారిపై బెంగతో అక్కడ ఉండలేకపోతోందట అందుకే వచ్చే నెలలో భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతోందట.
తాను మానసికంగా ఆందోళనగా ఉన్నానని, పిల్లలను మిస్సవుతున్నానని, వెనక్కి వెళ్లిపోవడంతప్ప వేరే మార్గం లేదని ఆమె భావిస్తున్నారని ఆమె పాకిస్థానీ భర్త నస్రుల్లా (29) తెలిపారు. అప్పటికే ఆమెకు భారత్‌లో పెళ్లయి 15, 9 ఏళ్ల ఇద్దరు పిల్లలున్నారు. ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని, తన దేశానికి వెళ్లి పిల్లలను కలుసుకోనివ్వడం మంచిదని భావిస్తున్నానని నస్రుల్లా తెలిపారు. సంబంధిత పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే నెలలో భారత్‌కు అంజు వెళ్లనుందని వెల్లడించారు.
జులైలో రాజస్థాన్ నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయిన అంజు అదే నెల 25వ తేదీన ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఆ దేశంలోనే తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.