అన్నా హజారే అంటే తెలియని వారు ఉండరు. అవినీతిని అంతం చేయడానికి గతంలో ఆమరణ నిరాహారా దీక్ష చేసి దేశ వ్యాప్తంగా అభిమానులను అన్నా హజారే సొంతం చేసుకున్నారు. తర్వాత కూడా ఆయన పోరాటాలు ఆగలేదు. వృద్ధత్వం వచ్చినా.. ఇటీవల ఒక సమస్యపై తన ఇంటి వద్ద నుంచే పోరాటం చేశారు. తాజా గా అన్నా హజారే మరో పోరాటానికి సిద్దం అయ్యారు. అంతే కాకుండా ఫిబ్రవరి 14 నుంచి ఆయన ఆమరణ నిరాహారా దీక్ష చేయనున్నారు. అయితే ఈ ఆమరణ నిరాహారా దీక్ష ఎందుకు అంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మద్యం పాలిసీని తీసుకువచ్చింది.
ఈ పాలిసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్ లలో మద్యాన్ని విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. కాగ ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. కాగ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త అన్నా హజారే మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే మహా రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలిసీని ప్రవేశ పెట్టేందుకు సిద్దం అయింది. దీంతో అన్నా హజారే ఈ నూతన మద్యం పాలిసీని వ్యతిరేకిస్తు ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీక్షకు సంబంధించి అన్నా హజారే లేఖను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు రాశారు.