కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి అనూప్‌చంద్ర పాండే నేడు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతోండగా, రాజీవ్‌కుమార్, అనూప్‌చంద్ర పాండేలు కమిషన్ సభ్యులుగా ఉన్నారు. అనూప్‌చంద్ర పాండే 1984 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అధికారి. ఆయన గతంలో యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడంతో పాటు, కేంద్ర సర్వీస్‌లలోని వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. కాగా అనూప్ చంద్ర పాండే మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2024 ఫిబ్రవరితో ఆయన పదవీ కాలం ముగియనుంది.
కాగా గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునీల్ అరోడా ఏప్రిల్ 12న పదవీ విరమణ చేసారు. దీంతో ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక పదవి ఖాళీగా ఉంది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(2) ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అనూప్ చంద్ర పాండేను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ మంగళవారం వెల్లడించింది. తాజాగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.