ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బదిలీలకు ఆమోదాన్ని ఇచ్చింది. ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై గైడ్లైన్స్ ని విడుదల చేశారు. మొత్తం 12 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీలకు వీలుగా ఆగస్టు 19 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖలో మాత్రమే బదిలీలకు అనుమతి ఇచ్చింది.
మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు.. అలాగే గనులు, పౌరసరఫరాల శాఖ, దేవదాయ, అటవీ పరిశ్రమలు, విద్యుత్, రవాణా తో పాటుగా వాణిజ్య, పనులు, స్టాంపులు శాఖతో పాటుగా అన్ని శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ ఉద్యోగుల బదిలీలకు ఆమోదాన్ని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్ శాఖకు సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు బదిలీలకు అనుమతులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉపాధ్యాయులు, వ్యవసాయం, వెటర్నరీ, వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం ప్రస్తుతం బదిలీలకు అనుమతి ఇవ్వలేదు. ఐదేళ్లపాటు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో క్లియర్ గా చెప్పింది. 2024 జూలై 31వ తేదీ నాటికి ఐదేళ్లుగా ఒక్క చోట ఉద్యోగంలో ఉన్న వాళ్ళని బదిలీ చేయాలని తెలిపింది.