ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్ ఈరోజు ఖండూ చేత ప్రమాణం చేయించారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.
అరుణాచల్ ప్రదేశ్ దివంగత మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడే పెమా ఖండూ. 2011లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దోర్జీ ఖండూ మరణం తర్వాత పెమా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. తొలుత కాంగ్రెస్‌లో పని చేసిన పెమా ఖండూ నబమ్ తుకి కేబినెట్లో(కాంగ్రెస్)లో మంత్రిగా ఉన్నారు. 2016లో అరుణాచల్‌లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం వల్ల రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏర్పాటైన కలిఖో పుల్ సర్కారులో పెమా మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తుకి ప్రభుత్వాన్ని పునరుద్ధరించినా తుకి రాజీనామాతో 2016 జులైలో పెమా ఖండూ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో మళ్లీ ముక్తో నుంచి గెలిచి, సులభంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచి ముచ్చటగా మూడోసారి సీఎం బాధ్యతలు చేపట్టారు.