నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డైట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 48 సార్లు భోజనంలో కేవలం మూడు మామిడి పండ్లు తీసుకున్నానని తెలిపారు. ఒక్కసారి మాత్రమే ఆలూపూరీ తిన్నానని అది కూడా నవరాత్రి ప్రసాదమని రౌజ్‌ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. తిహాడ్‌ జైల్లో తనకు ఇన్సులిన్ అందించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా తన వాదనను వినిపించారు.

చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్‌ డాక్టర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ ఆయన ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన అభ్యర్థనను వ్యతిరేకించిన ఈడీ..  ‘‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్‌కు అనుమతి ఉంది. టైప్‌-2 డయాబెటీస్‌తో బాధ పడుతున్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అరటిపండు, మామిడి పండ్లు, స్వీట్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నారు. ఆరోగ్య కారణాల కింద బెయిల్‌ పొందడం కోసం ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు’’ అని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది

ఈడీ ఆరోపణలను సీఎం తరఫు న్యాయవాది ఖండిస్తూ.. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై నివేదిక ఇవ్వాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించిన ధర్మాసనం ఇవాళ మరోసారి వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news