అసోంలో జరిగిన ఓ కారు ప్రమాదంలో లేడీ సింగం మృతి చెందారు. పోలీస్ విభాగంలో ‘లేడీ సింగం’గా పేరు తెచ్చుకున్న మహిళా ఎస్ఐ జున్మోని రభా మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని నాగావ్ జిల్లాలోని సరుభుగియా గ్రామ సమీపంలో కంటైనర్ ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జున్మోని రభా ప్రాణాలు విడిచిందని వైద్యులు ధ్రువీకరించారు. ఎస్ఐ అకాల మరణంపై ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. సహోద్యోగులు ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జున్మోని రభా మంగళవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పోలీస్ యూనిఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో వ్యక్తిగత పనుల కోసం తన ప్రైవేటు వాహనంలో ఒంటరిగా బయలుదేరిందని జఖలబంధ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పవన్ కలిత తెలిపారు. అప్పుడు ఆమె వెంట ఎటువంటి సెక్యూరిటీ లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆమె వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు.